10, జూన్ 2014, మంగళవారం


కీడని యెంచకుండ రతి కేళికి నర్తనశాల లోపలన్ 
గూడగ నెంచి రమ్మనుచు గోరెను మించిన కామవాంఛతో
వేడెను కీచకుండు తన వేదన నంతయు వెళ్ళబుచ్చి య
ల్లాడెను, చేయి బట్టుకొని లాగెను, ద్రౌపది కౌగిలింతకై!
భారత మంత్రి మండలి సభాస్థలి పూనిక జేయుచుండగా
పేరును బొందినట్టి పలు వేదిక లందున, చిత్రసీమలో
వీరులు, నాయకీమణులు, వేడుక సల్పగ వచ్చిచేరి రా
తారల కాంతిచే పగలు తళ్కులు చిందియు తెల్లబోయెగా!
లంకకు ముప్పనెంచక నరాచక రీతిగ జానకీ సతిన్
బింకముతోడ నెత్తుకొని వెళ్ళిన రావణు ద్రుంచ రాము డా
లంకకు జేరి పోరగ విలక్షణ లక్ష్యయుతుండు ధర్మ నా
శంకరు డుద్ధతిన్ బఱపె సాయకకోటిని రామచంద్రుపై!
అతి సుకుమారి యందమున నప్సర యైన శుభాంగి చక్కగా
బ్రతుకును తీర్చిదిద్దగల భర్తను గోరుచు సౌఖ్యమందుటే
హితమని యెంచి శ్రీలు గల యింటను పుట్టిన బుద్ధిమంతుడౌ
సుతుని వరించి చేరి యొక సుందరి తేలె మనోజ కేళిలోన్!
పడుచుతనములోన చిలిపి పనులు జేసి
వయసుమళ్ళిన ముదుసలి వయసులోన
గతపు చేష్టలు సతతము మతికి రాగ
పడుచు కోరికల్ సెలరేగు వార్ధకమున!

8, జూన్ 2014, ఆదివారం

కలతల్ రేపెడు నీచ మానవులు సంస్కారంబు లోపింపగా 
పలు చందంబుల యుగ్రచర్యలను విశ్వంబంత సృష్టింపగా 
జ్వలితంబౌ బడబాగ్నికీలలను విజ్ఞానాస్త్ర రూపమ్మునన్ 
శలభంబుల్ బడబాగ్ని నార్పె నమితోత్సాహమ్మువెల్గొందగన్!
రయమున బాలబాలికలు రంజిలు నాట్యము జేయుచుండ వి
స్మయమును గొల్పునట్టి మన సైన్యము వింతలు సల్పుచుండగా
భయమును గొల్పు చల్లనగు వాయువు వీచెడు శీతకాలమే
అయినను పోయి చూడవలె హస్తినలోగణతంత్ర పర్వమున్!

6, జూన్ 2014, శుక్రవారం

వారాంతంబున మంచి పాకము నిడన్ వాత్సల్య ముప్పొంగగా
కారుణ్యామృత మూర్తి భర్త కొరకై కాంక్షా ప్రియత్వమ్మునన్
నోరూరించెడి వంటకంబు లిడుచున్ నోరార హృద్యప్రమో
దా! రా! రమ్మని పిల్చె నొక్క సతి భర్తన్ ప్రేమ పొంగారగా!
దాతగు నొక్క తండ్రి మరి తల్లికి కూతురు పుట్టగా సుతన్
బ్రీతిగ బెంచ బెద్దదయె, బిడ్డకు తండ్రి వియోగ మేర్పడన్
గూతురు గర్భమందునొక గుంటడు బుట్టగ తండ్ర నెంచి యా
కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చిపాలిడెన్!
జవరాలి నడుము తీవని
సవినయముగ తెలియజేసి సంబరపెడుతూ
కవనము లల్లుచు నిచ్చిన
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్!

పలురకముల పుష్పములకు
నెలవాయెను భూతలమ్ము నెత్తావులతో
తలమానికమౌ విరి రే
కుల వాసన నెంచి చూడ ఘుమఘుమ లాడున్!

5, జూన్ 2014, గురువారం

ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో
నాకిక పెండ్లి చేయగల నాథుడు లేడని పైకమున్న యే
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో!